Trending Now

వారి ప్రకటనలు చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు : కిషన్ రెడ్డి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి.. ఇద్దరికి ఇద్దరు వారికి ఏది తోచితే అలా అబద్ధాలు మాట్లాడుతున్నారని.. వారి ప్రకటనలు చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యం కలిగినవారని.. రజాకార్లు, నిజాం పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలది. పచ్చకామెర్లు సోకిన రోగి మాదిరిగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఉంది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ. కాంగ్రెస్ కు మారుపేరే అవినీతి అని కాంగ్రెస్‌పై ఆయన ఫైరయ్యారు.

6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేశామంటూ ప్లెక్సీల రూపంలో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నరు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో అభద్రతాభావం, అసహనం, అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు వార్తలు పెరిగిపోతున్నాయి. ప్రజలకు నిజాలు చెబితే ఎలాగూ కాంగ్రెస్ గెలవలేదని.. వీలైనన్ని అబద్ధాలు చెప్పి, బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తాము చెప్పిందే వేదంగా నమ్ముతారనే భ్రమలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంతో రేవంత్ రెడ్డి నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నరన్నారు. కేసీఆరే ప్రమాదకారి అనుకుంటే.. కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి కూడా అత్యంత ప్రమాదకారిగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. అధికారం కోసం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారు. ఏదైనా మాట్లాడుతారు. ఎంత అబద్ధమైనా అవలీలగా చెప్పే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ అబద్ధాలు ఆడటంలో వారికి వారే సాటి అని.. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ఇంటిపేరుగా మార్చుకుని 75 సంవత్సరాలుగా దేశంలో రాజకీయాలు చేసిందని మండిపడ్డారు.

పుల్వామా దాడులకు సంబంధించి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ విషయంలో రేవంత్ రెడ్డి వాస్తవాలేంటని అడుగుతున్నాడు. భద్రతాదళాలపై కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ నమ్మకం లేదు.. సైనికుల శక్తిపై విశ్వాసం లేకుండా, వారి ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా అనేకసార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. పాకిస్థాన్ దగ్గర ఆటం బాంబ్ లు ఉన్నాయి.. కాబట్టి ఆ దేశానికి అణిగిమణిగి ఉండాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు అంటున్నాడు. పాకిస్థాన్ కు అణిగిమణిగి ఉండటం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. నేడు దేశంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. పాకిస్థాన్ దాడులను, ఎత్తుగడలను తిప్పికొట్టి పూర్తిగా నిలువరించి నడ్డివిరిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు.. ఆ పార్టీ అసమర్థ, చేతగానితనం కారణంగా పాకిస్థాన్ కు అడ్డుకట్ట వేయలేకపోయింది.

పాకిస్థాన్ చంపేవాళ్లు.. భారతీయులు చచ్చేవాళ్లు అనేలా వదిలేసింది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ పై ఒక్కసారి దాడికి పాల్పడితే.. వందసార్లు దాడికి పాల్పడుతామంటూ ధీటైన జవాబిచ్చారు. చేసిన పాపాలకు గాను నేడు పాకిస్థాన్ ప్రపంచ దేశాల ముందు భిక్షం ఎత్తుకునే పరిస్థితికి భారత్ తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు పాకిస్థాన్ ను పెంచిపోషించింది. పాకిస్థాన్ దౌర్జన్యాలకు భయపడిన కాంగ్రెస్ పార్టీ.. భారతీయ జనతా పార్టీకి సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పాకిస్థాన్ దగ్గర ఉన్న అణుబాంబులకు భారతదేశం భయపడదు.. భారత సార్వభౌమాధికారం కాపాడే విషయంలో ఎక్కడా తగ్గేది లేదని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్థాన్ గాజులు పెట్టుకోలేదంటూ ప్రకటనలిస్తున్నాడు. భారతదేశంలో ఉంటూ, మన దేశ పార్లమెంటు లో కూర్చుంటూ పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో దాడులు చేయాల్సిన అవసరం లేదు.. కశ్మీర్ ప్రజలే భారతదేశ అభివృద్ధిని చూసి ఎటువైపు ఉండాలో నిర్ణయించుకుంటారని రాజ్ నాథ్ సింగ్ గారు మాట్లాడితే.. ఫరూక్ అబ్దుల్లా పాకిస్థాన్ గాజులు పెట్టుకోలేదంటూ ప్రకటనలివ్వడం సిగ్గుచేటు. కేసీఆర్ కుటుంబం వైఖరి కారణంగా, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు లేని కారణంగా.. కేంద్రం అనేక రకాలుగా తెలంగాణకు సహకారం అందించినా బీఆర్ఎస్ ప్రభుత్వం అందిపుచ్చుకోలేదంటూ గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కానీ అదే రేవంత్ రెడ్డి.. గతంలో చేసిన ప్రకటనను మర్చిపోయి.. గాడిదలతో గుడ్లు పెట్టించే స్థాయికి దిగజారిండు.

రేవంత్ రెడ్డి.. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. కేసీఆర్ మాదిరిగానే గోబెల్స్ ప్రచారానికి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అనేక రకాలుగా నష్టపోయింది. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పలు రాష్ట్రంగా దివాళా తీయించింది. కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పెన్షనర్లకు చెల్లాంచాల్సిన కరువు భత్యం, బకాయిలను చెల్లించలేదు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెన్షనర్లకు కరువుభత్యం, బకాయిలను చెల్లించడం లేదు. జులై 1, 2022 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు కరువుభత్యం పెండింగులోనే ఉంది. 2022 సంవత్సరం నుంచి ఇంతవరకు పెన్షన్లకు సంబంధించి ఎలాంటి చెల్లింపులు చేయలేదు.

బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు మాత్రం కాంట్రాక్టర్ల కోసం రాష్ట్రానికి వస్తున్న ఆదాయ వనరులను మళ్లించి, కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించి లబ్ధి పొందుతున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు సుమారు రూ. 5 వేల కోట్లు పెండింగులో ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పుల చెల్లింపుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ సర్కారు అలసత్వం వహిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ బకాయిలు పేరుకుపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏ గ్యారంటీని అమలు చేయకుండా .. అబద్ధాలతో ప్రచారం చేసుకుంటోంది.

ఈ ఎన్నికలు రెఫరెండం అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిపై రెఫరెండమా.. లేక ఆర్ ఆర్ ట్యాక్స్ పై రెఫరెండమా అనేది ప్రజలు ఈ ఎన్నికల్లో తేల్చిచెప్పుతారు. లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను. ఈరోజు సాయంత్రంతో ప్రచారపర్వం ముగుస్తుంది. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, ఆరోపణలను అడ్డుకునే శక్తి తెలంగాణ ప్రజలకు ఉంది. తెలంగాణ ప్రజలు తప్పకుండా బీజేపీకి అండగా నిలబడుతారు. నీతి, నిజాయితీ, ధర్మబద్ధంగా, దేశం కోసం బీజేపీ చేసే పోరాటాలకు ప్రజలు అండగా ఉండాలని కోరుతున్నాను. ప్రజలు చాలా తెలివైనోళ్లు. పేద ప్రజల కోసం గత మూడున్నర సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి గాడిద గుడ్డులాగా కనిపిస్తున్నాయా..? అని ప్రశ్నించారు.

ప్రజలకు కట్టించిన టాయిలెట్లు, బస్తీ దవాఖానాలు, పీఎం కిసాన్ డబ్బులు, ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా గ్రామాల్లో వేస్తున్న రోడ్లు, తెలంగాణలో నిర్మించిన 2,500 కి.మీ జాతీయ రహదారులు, యూరియా పరిశ్రమ, ఎరువుల మీద రైతులకు ఎకరాకు ఇచ్చే రూ. 20వేల సబ్సీడీ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అమృత్ కాల్ లో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఎంఎంటీఎస్ రెండవ ఫేస్ రైళ్లు, పేద ప్రజలకు, పొదుపు సంఘాలకు ఇస్తున్న బ్యాంకు లోన్లు రేవంత్ రెడ్డికి గాడిద గుడ్డులాగా కనిపిస్తున్నాయా..? అహంకారపూరితంగా అబద్దాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని రేవంత్ రెడ్డి అనుకోవడం తప్పు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సహకరించినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడిందని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండింతలు ఎక్కువ అబద్దాలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. సోమవారం జరిగే పోలింగ్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News