నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల)ఫైజాన్ అహ్మద్..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 11 : పార్లమెంట్ ఎన్నికల విధులను నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అధికారులకు అవగహన సమావేశం నిర్వహించారు. అధికారులకు ఎన్నికల్లో పాటించవలసిన నియమ నిబందనల పై అవగహన కల్పించారు. పోలింగ్ కు ఒకరోజు ముందు ఉదయం సకాలంలో ఈవీఎం పంపిణీ కేంద్రానికి వచ్చి అన్ని రకాల ప్రక్రియలు పూర్తిచేసి మద్యాహ్న సమయానికల్లా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరాలని ఆదేశించారు. పోలింగ్ జరిగే సమయంలో నిర్దేశించిన డేటా ఎంట్రీ యాప్ లో సమయానికి పోలింగ్ శాతానికి సంబందించిన వివరాలను పంపవల్సిందిగా ఆదేశించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈవీఎం యంత్రాలలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తి పోలింగ్ నిలిచిపోతే పోలింగ్ ను తిరిగి త్వరితగతిన ప్రారంభించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహించే అన్ని రకాల రిజిస్టర్లు, ఫారాలు నింపుటపై అవగహన కల్పించారు. రిజిస్టర్లు, ఫారలు నింపే క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి గానీ, ఓటర్లకు గానీ అనారోగ్య సమస్యలు ఏర్పడితే అత్యవసర వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు. పోలంగ్ కేంద్రాల సమీపంలో రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు, త్రాగు నీరు, మజ్జిగ వంటివి పంపిణీ చేయకుండా చూడాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు ఎన్నికలపై సిబ్బందికి ఎన్నికల విధులపై అవగహన కల్పించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, ఎంపీడీవోలు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.