ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మిషన్ భగీరథ వృధా నీటితో పాటు వర్షాలు పడ్డ సమయంలో వస్తున్న ప్రవాహంతో కమ్మదనం గురుకుల పాఠశాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అలా జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలు వెంటనే తీసుకుంటామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యాలత తదితర విద్యార్థులు తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యే శంకర్ వెంటనే స్పందించారు. మంగళవారం స్థానిక కమ్మదనం గురుకుల పాఠశాలను అలాగే భగీరథ వాటర్ ప్లాంట్ ను సందర్శించారు. మిషన్ భగీరథకు సరఫరా అవుతున్న నీటి విషయంలో సాంకేతిక లోపాలతో నీరు వృధాగా పాఠశాలల్లోకి వస్తుందని ఆ సమయంలో సిబ్బంది ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో నీరంతా గురుకుల పాఠశాలలోకి ప్రవేశిస్తుందని పాఠశాల ప్రిన్సిపల్ విద్యాలత తెలిపారు. అయితే అదే సమయంలో వర్షాలు పడ్డప్పుడు కూడా నీరు పాఠశాలల్లోకి చేరుతుండడంతో పాఠశాల క్రీడా ప్రాంగణంతో పాటు విద్యార్థుల తరగతి గదులలోకి కూడా నీరు చేరుతుందని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ వృధా నీరు రాకుండా తమ గురుకుల పాఠశాలలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ ను ప్రిన్సిపాల్ విద్యాలత కోరారు.
ప్రత్యామ్నాయ మార్గాలు చూద్దాం..
గురుకుల పాఠశాలలో వర్షం నీటితో పాటు మిషన్ భగీరథ నీటి సమస్య పాఠశాల విద్యార్థులకు అనేక సమస్యలు ఏర్పడుతున్న విషయమై ఎమ్మెల్యే శంకర్ మిషన్ భగీరథ ఈఈ నాగేశ్వరరావు, డీఈ సందీప్, ఏఈ రూప తదితర అధికారులతో సంఘటన స్థలంలో పిలిచి మాట్లాడారు. ఈ సమస్యను అధిగమించాలని గురుకుల పాఠశాలకు వస్తున్న వృధా నీరు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు. అదేవిధంగా పాఠశాల లోతట్టుగా ఉండటం వల్ల వర్షం నీరు వస్తుందని దీనిని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వన్యప్రాణులకు ఈ వృధా నీరు అవసరమయ్యేలా తాగడానికి ఈ నీరు జంతువులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ నీరు పాఠశాలకు రాకుండా ఇతర స్థలానికి మళ్ళించి అక్కడ ఒక నాలుగు ఎకరాల వరకు స్థలం చూసి ఆ నీటిని అందులో మళ్లించాలని అధికారులకు చెప్పారు. అయితే ఈ విషయమై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడతానని ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శంకర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమ్మదనం గురుకుల హెచ్ఎం విద్యాలత, మిషన్ భగీరథ ఈఈ నాగేశ్వరరావు, డిఈ సందీప్, ఏఈ రూప, ఫరూక్ నగర్ మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, బాబర్ అలీ ఖాన్, కమ్మదనం ఎంపీటీసీ బొమ్మ అరుణ అంజయ్య గౌడ్, దేవగిరి నవీన్, లింగారెడ్డిగూడెం అశోక్, చందు, రాజు, రాఘవేందర్, శ్రీశైలం, యాదయ్య తదితరులు ఉన్నారు.