ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్‌లో దేశంలోనే అత్యధిక ఓటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో నమోదైందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలో మొత్తం 81.86శాతం ఓట్లు పోలైనట్లు ఆయన వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66శాతం, మిగితా ఓట్లు బ్యాలెట్ పేపర్ల ద్వారా పడినట్లు తెలిపారు. 2014లో 78.41%, 2019లో 79.77% పోలింగ్ నమోదైందన్నారు.
అల్లర్లు సృష్టించిన వారిని గుర్తించాం..
ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌ల వద్ద అల్లర్లు సృష్టించిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సీసీ కెమెరాల్లో అంతా రికార్డయిందని, దాడులు చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. తాడిపత్రి, నరసరావుపేటలో ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 715 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామన్న ముకేశ్ కుమార్.. నాలుగు చోట్ల 144 సెక్షన్ విధించామన్నారు.