ధర్నాలో బీఅర్ఎస్ నాయకులు
ప్రతిపక్షం, సిద్దిపేట, మే 16: రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల కపట ప్రేమతో నటిస్తున్నారని నిన్నటితో తేటతెల్లమైందని బీఅర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, నాగిరెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సోమిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టం కలిగించినా ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోయినా రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపుమేరకు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సన్న వడ్లు దొడ్డు వడ్లు అనే తేడా లేకుండా కింటాలు ధాన్యానికి 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి.
అనంతరం వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న వడ్లకు బోనస్ ఇవ్వడంతో పాటు, దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు పరిచాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా బీఆర్ఎస్ పోరాటం చేస్తేనే కాలేశ్వరం నుండి రైతులకు నీళ్లు వదిలారని గుర్తు చేశారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పార్టీ రైతుల వెంటే ఉండి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, చందర్ రావు, పలువురు పాల్గొన్నారు.