పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలి..
రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి
ప్రతిపక్షం, సిద్దిపేట, మే 16: సీఎంఆర్ డెలివరీలు వేగవంతం చేయాలని మిల్లర్లను కలెక్టర్ యం. మను చౌదరి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయంలో కలెక్టర్ యం. మను చౌదరి వానాకాలం 2023-24 సీఎంఆర్ డెలివరీలు, యాసంగి 2023-24 సంబంధించిన వరిధాన్యం కొనుగోళ్ళ విషయంలో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వానాకాలం 2023-24 లో సీఎంఆర్ పెండింగ్ ఉన్న రైస్ మిల్లర్లు అందరూ ప్రతి రోజూ తమ మిల్లింగ్ కెపాసిటీ అనుగుణంగా సీఎంఆర్ డెలివరీ చేయాలని.. ఏ ఒక్క మిల్లరూ సీఎంఆర్ డెలివరీలో జాప్యం చేయరాదని, సీఎంఆర్ డెలివరీలు వేగవంతం చేయాలనీ ఆదేశించారు. అదే విధంగా అధిక సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల నుండి, వేగంగా డెలివరీ చేసే మిల్లర్లకు తమ స్వంత ఖర్చులతో ధాన్యం ట్రాన్స్ఫర్ చేసి సీఎంఆర్ సకాలంలో పూర్తి చేసేలా పౌర సరఫరాలు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాసంగి 2023-24 కి సంబంధించిన వరిధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా నిర్వహించాలని, రైతు ఏ దశలోనూ ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని, మిల్లర్లు ధాన్యం దిగుమతిలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని సూచించారు. రైస్ మిల్లర్స్ అధ్యక్షులు కే. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వచ్చే వారం రోజుల్లో కాజీపేట చెర్లపల్లి ఎఫ్‌సీఐ గోదాంల్లో స్థలాభావం ఏర్పడుతుంది అని ఇట్టి సమస్యని పరిష్కరించాలని కోరారు. ఇట్టి విషయంలో కలెక్టర్ జనరల్ మేనేజరు ఎఫ్‌సీఐతో మాట్లాడి సమస్యని పరిష్కరించేలా చూస్తానని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) పి. శ్రీనివాస్ రెడ్డి, డీసీయస్ఓ తనూజ, డీయం (సీయస్‌సీ) హరీష్, మిల్లర్ల ప్రతినిధులు, మిల్లర్లు పాల్గొన్నారు.