Trending Now

అమ్మవారి భూములకు ఎసరు..

దర్జాగా దేవాదాయ భూమి రిజిస్ట్రేషన్

మళ్ళీ అమ్మకానికి పెట్టిన వైనం

ప్రతిపక్షం, షాద్ నగర్, మే17: “అమ్మా నీవే దిక్కు” అని మొక్కే అమ్మవారి భూములకే శఠ గోపం పెట్టారు కొందరు ప్రబుద్దులు. ప్రభుత్వ, అసైన్డ్ భూములు చాలవన్నట్టు అమ్మవారి భూముల కబ్జాకు తెరలేపారు. డబ్బు సంపాదన కోసం ఏకంగా అమ్మవారి ఆస్థినే కాజేశారు. ఆ ప్రబుద్ధులు. దేవాలయానికి చెందిన కోట్ల విలువైన భూమిని యదేచ్ఛగా రిజిస్టర్ కూడా చేసుకున్నారు. దేవాదాయ శాఖ కళ్లు గప్పి తమ కబందాల్లోకి తీసుకున్నసదరు భూమిని మరోమారు అమ్మజూపుతూ భూ పందేరానికి తెరలేపి.. దేవుడి భూమినీ మాయం చేయాలని చూస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో గ్రామస్తులు దేవాదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో గల శ్రీ అంబా భవాని మాత దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం ప్రతి నిత్యం కొలిచే భక్తులకు కొంగు బంగారంగా నిలస్తున్నది. ఈ దేవాలయాన్నిపూర్తిగా 2008 సంవత్సరంలో దేవాదాయ శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే గ్రామంలోని శ్రీ అంబా భవాని మాత దేవాలయం పేరున గ్రామ శివారులో సర్వే నెంబర్ 441 లో 3 ఎకరాల 28 గుంటల భూమి ఉంది. బహిరంగ మార్కెట్ లో సదరు భూమి విలువ సుమారుగా 15 కోట్ల పైమాటే. ఈ మొత్తం భూ విస్తీర్ణాన్ని దేవాదాయ శాఖ రిజిస్టరు 43 లో గతంలోనే నమోదు చేసింది.

ఇదిలా ఉండగా ఈ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు అనుభవదారులమంటూ చెప్తూ 2015 లో అక్రమంగా 2031/ 2015 డాక్యుమెంట్ ద్వారా రిజిష్టర్ చేశారు. ఈ తరహాలో రిజిష్టర్ చేసుకున్న తుమ్మలపల్లి గుల్లె కృష్ణయ్య ను రెవెన్యూ రికార్డులో పట్టాదారునిగా చూపారు. అయితే సదరు భూమిని కొన్న వ్యక్తి మరోమారు భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

దేవాదాయశాఖకు గ్రామస్తుల ఫిర్యాదు..

ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న గ్రామస్తులు కొందరు అంబా భవాని మాత దేవాలయానికి సంబంధించిన భూములను కాపాడాలంటూ రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ అసిస్టెంట్ కమీషనర్ కృష్ణవేణికి వినతి పత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మవారి ఆస్థిని అమ్మిన వారిపై, కొన్నవారిపై కఠిన చర్యలు తీసుకుని అంబా భవాని మాత ఆలయ భూములను కాపాడాలని కోరారు. దీనికి స్పందించిన ఆమె దేవాలయ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కానివ్వమని అన్నారు.

Spread the love

Related News

Latest News