Trending Now

‘ఠాగూర్‌ సినిమా సీన్‌ రిపీట్‌’..

చనిపోయిన బతికి ఉన్నట్లు చికిత్స చేసిన వైద్యులు

వైద్యుల నిర్లక్ష్యం యువకుడి మృతి

ప్రతిపక్షం ప్రతినిధి, నిజామాబాద్‌ మే 17: దాదాపు 20 యేండ్ల క్రితం వచ్చిన ఠాగూర్‌ సినిమాలో ఓ సీన్‌ను నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రి వైద్యులు రిపీట్‌ చేసిన సంఘటన వెలుగుచూసింది. ప్రయివేట్‌ ఆసుపత్రుల వైద్యుల ధన దాహానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది అనే దానికి ఇదే నిదర్శనము. వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట్‌ మండలం నిజాంపూర్‌ గ్రామానికి చెందిన పిట్ట నారాయణ(36)కు గుండె నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ నగరంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో గల ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. నారాయణకు ఆరోగ్య శ్రీ పథకం వర్తించిందని, ఆపరేషన్‌ చేయాలని, ఇవే కాకుండా రూ. 80వేలు చెల్లించాలని చెప్పారు.

అనంతరం గురువారం నారాయణకు ఆపరేషన్‌ చేసి విజయవంతం అయ్యిందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. కానీ నారాయణ అప్పటికే మృతి చెందాడు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తాము నారాయణను చూస్తామని చెప్పగా వైద్యులు అనుమతించలేదు. పైగా ఠాగూర్‌ సినిమాలో సన్నివేశం తలపిస్తూ నారాయణ కు రక్తం ఎక్కించాలని కొత్త డ్రామకు తెర లేపి డబ్బులు చెల్లించాలని అంటూ ఒత్తిళ్లు తీసుకువచ్చారు. వైద్యులు నారాయణ మృతి చెందిన విషయాన్ని దాచిపెట్టి డబ్బులు వసూలు చేయటంపై మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు దిగారు. నాల్గవ టౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని గొడవ కాకుండా బందోబస్తు నిర్వహించి, మృతదేహాన్ని అంబులెన్స్‌ నిజాంపూర్‌కు తరలించారు. అనంతరం బంధువులు, గ్రామస్తులు సీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఆందోళనకు దిగారు.

Spread the love

Related News

Latest News