Trending Now

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ప్రతిపక్షం, హనుమకొండ ప్రతినిధి, మే 18: ఈ నెల 24వ తేదీ నుండి 30 వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత, పర్యవేక్షణ ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరీక్షల నిర్వహణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో మూడు కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలన్నారు.

గ్రూప్ -1 ప్రిలిమనరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి..

టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్షను జిల్లాలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జూన్ 9న నిర్వహించే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదన్నారు. పరిక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఉంటుందన్నారు. 22,665మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరువుతున్నారని, 45 కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సరైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రతి పరీక్ష కేంద్రం బందోబస్త్ కోసం ఇద్దరు మహిళా, ముగ్గురు పురుష కానిస్టేబుళ్ళు నియమించాలన్నారు. పరీక్ష నేపథ్యంలో నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ బస్సులు ఉదయం 6 గంటల నుండి అభ్యర్థుల సౌకర్యార్థం ఎక్కువ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. రవాణా శాఖ అధికారులు ప్రశ్నపత్రాల చేరవేతకు, పరీక్ష అనంతరం తిరిగి తీసుకువచ్చేటప్పుడు తగినన్ని వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, డీసీపీ రవీందర్, ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి గోపాల్, డీఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News