ప్రతిపక్షం ప్రతినిధి నిర్మల్ ,మే 22 :
నిర్మల్ జిల్లా భైంసా పురపాలక సంఘం కమిషనర్ వెంకటేశ్వర్లు, పురాణ బజార్ బిల్ కలెక్టర్ విద్యాసాగర్ బుధవారం సాయంత్రం ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పురాణ బజార్ లో నివాసం ఉండే వ్యవసాయ రైతు లాలా రాదేశ్యా అదే ప్రాంతంలో తన సొంత ఇంటి నిర్మాణం కోసం 2022 లోనే అధికారిక విధి విధానాలకు అనుగుణంగా పురపాలక సంఘం ద్వారా ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకున్నారు. అయితే తిరిగి ఈ నెల 16న ఆయన నిర్మించుకున్న ఇంటికి ఎలాంటి అనుమతులు లేవని ఏడు రోజులలో తగిన విధంగా ఆధారాలతో జవాబు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ నుంచి నోటీసి జారీ చేసి బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ద్వారా ఇంటి నిర్మాణ యజమాని అయినా లాలా రాదే శ్యాం కు అందజేశారు. ఈ విషయమై నేరుగా మున్సిపల్ కమిషనర్ తో పలు దఫాలు మాట్లాడిన సదరు నిర్మాణదారుడికి తీవ్ర ఇబ్బందులు ,మానసిక శోభలే మిగిలాయి.దీంతో రహస్య మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తే రూ.30 వేలు ఇస్తే ఇంటి నిర్మాణ అనుమతులు తదితర విషయాలని ధృవీకరించి తగిన విధంగా అధికారిక గుర్తింపు పత్రాలు ఇవ్వడం జరుగుతుందని బిల్ కలెక్టర్ ద్వారా సమాచారం అందించిన కమిషనర్ కు అదే రీతిలో బుధవారం సాయంత్రం రూ.30 వేలు అందించేందుకు బాధితుడు పురపాలక సంఘ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ తో సంప్రదింపులు జరుగుతున్న సందర్భంలో ఏసీబీ అధికారులు బాధితుడు లాలా రాధేశ్యాం ఇచ్చిన పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ లను అదుపులోకి తీసుకున్నారు. రూ. 30 వేల నగదును స్వాధీనపరుచుకున్నారు. బాధితుడు లాలా రాధేశ్యాం ఇచ్చిన పక్కా ఫిర్యాదు మేరకు బైంసా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ లను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని అవినీతి నిరోధక శాఖ డిఎస్పి వివి రమణ మూర్తి ఈ సందర్భంగా తెలిపారు.