బైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 23 : నిర్మల్ జిల్లా బైంసా పురపాలక సంఘం పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి నేరుగా తీసుకు రావాలని బైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్. గురువారం స్థానికంగా తన చాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బైంసా పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్లు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాలయ నిత్య కార్యకలాపాలపై ఆరా తీయడం జరిగిందని చెప్పారు. పదేళ్లుగా భైంసా పురపాలక సంఘం లో ఎలాంటి అవినీతి,అక్రమాలు జరగకుండా పకడ్బందీ ప్రణాళికతో సుస్థిర పాలనను అన్ని సామాజిక వర్గాలకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి పట్టణంలోని అన్ని ప్రాంతాలలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. బుధవారం బైంసా మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్ లు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కడం తనను ఎంతగానో బాధించిందని వాపోయారు. పురపాలక సంఘ కార్యాలయంలో శాఖ పరమైన ఎలాంటి పనులున్నా నేరుగా తనకు సంప్రదించి సదరు పనులను చేయించుకోవాల్సిన బాధ్యత పట్టణ ప్రజలపై ఉందని చెప్పారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణ అనుమతులు,అసిస్ మెంట్, ముటేషన్, ట్రెడ్ లైసెన్స్ ల జారీ, పారిశుద్ధ్య పనులు ఇతరత్రా ఎలాంటి పనులున్నా తన దృష్టికి తీసుకొస్తే అధికారిక నియమ నిబంధనల ప్రకారం ఆ పనులు అయ్యేలా కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్ లు కార్యాలయంతో సంబంధం లేకుండానే వ్యక్తిగతంగా సదరు ఇంటి నిర్మాణదారునికి తగిన విధంగా నగదు డిమాండ్ చేసి పట్టుపడ్డారని వివరించారు. స్థానిక సానిటరీ ఇన్స్పెక్టర్ ఇంకొంతమంది సిబ్బంది కూడా పారిశుద్ధ్య పనుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో కూడా సానిటరీ పై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే సదరు ఇద్దరు ఉద్యోగుల వ్యవహారాలపై సీడీఎంఏ, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. కార్యాలయ సంబంధిత ఎలాంటి సేవలైన నేరుగా ప్రజలు ప్రభుత్వ ఆదేశాల అనుసారమే పొందవచ్చునని చెప్పారు. ఎలాంటి అనుమానాలు ఉన్న వ్యక్తిగతంగా తనకు కలిసి సమస్య పరిష్కారం చేసుకోవచ్చునని తెలిపారు. బైంసా పురపాలక సంఘ కార్యాలయంలో ఎవరు ఎలాంటి అవినీతి, అక్రమాలకు, లంచాలకు పాల్పడిన వారిపై కఠినమైన రీతిలోనే చర్యలు ఉంటాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు.