ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 24 : నిర్మల్ జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో శుక్రవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ప్రథమ సంవత్సరం ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు జిల్లాలో మొత్తం 3,416 విద్యార్థులు హాజరు కావలసి ఉంది. పరీక్ష కేంద్రాల వద్ద ముందస్తుగా.. జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 13 కేంద్రాలను ఏర్పాటు చేయగా పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులను పరీక్ష కేంద్రాల ప్రధాన గేటు వద్దే పూర్తిగా తనఖీలు చేసి పరీక్ష కేంద్రంలోనికి అనుమతి ఇచ్చారు. ఉదయం ప్రథమ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాస్తారు. జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ పర్యవేక్షణ అధికారి జాదవ్ పరశురాం మాట్లాడుతూ జిల్లాలోని 13 కేంద్రాలలో కూడా విద్యార్థులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. పరీక్ష కేంద్రాలను సంబంధిత ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, స్థానిక తహశీల్దార్ ఇతర అధికారులు కూడా పర్యవేక్షిస్తారని చెప్పారు.