ప్రతిపక్షం, వెబ్డెస్క్: షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ కీర్తిశేషులు అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరటి అరవింద్ యాదవ్ అనుమానాస్పద స్థితిలో ఆస్ట్రేలియాలో మృతి చెందాడు. గత 12 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో ఉద్యోగ నిమిత్తం అక్కడే స్థిరపడిన అరటి అరవింద్ యాదవ్ (30) గత ఐదు రోజుల క్రితం అదృశమైనట్టు ఆస్ట్రేలియాలోని వేల్స్ పోలీస్ ఫోర్స్ ఈస్ ఎ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ స్పష్టం చేసింది. మృతిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీ నేత అరటి కృష్ణ యాదవ్ 2006 ఏప్రిల్ 7వ తేదీన ఏలూరు వద్ద ఓ లారీ ప్రమాదంలో చనిపోయారు. తను ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఇనుప చువ్వల లారీని ఢీకొని అప్పట్లో కృష మృతి చెందారు. కృష్ణ సతీమణి ఉషారాణి షాద్ నగర్ పట్టణంలో నివసిస్తున్నారు. ఆమెకు ఒకే ఒక కుమారుడు అరటి అరవింద్.. అతను కూడా ఇలా ఆకస్మిక మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అరటి కృష్ణ సోదరుడు అరటి యాదయ్య, అరటి బాలకృష్ణను ఈ విషయమై మీడియా వివరాలు కోరగా వారు కన్నీటి పర్యంతమయ్యారు.
18 నెలల క్రితమే అరటి అరవింద్ కు వివాహం జరిగినట్టు వారు పేర్కొన్నారు. కేశంపేట మండలం చింతకొండపల్లికి చెందిన ఓ వ్యక్తి కూతురితో వివాహం జరిగినట్టు చెప్పారు. ఇటీవల అరవింద్ తల్లి ఉషారాణి, అరవింద్ భార్య ఆస్ట్రేలియా వెళ్లారని గత శనివారమే అరవింద్ తల్లి ఉషారాణి షాద్ నగర్ వచ్చేసారని కుటుంబ సభ్యులు చెప్పారు. తల్లి ఉషారాణి వచ్చిన మరుసటిరోజే అరవింద్ అదృశ్యం అయ్యాడని చెబుతుండడంతో అసలేం జరిగింది? అనే అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పోలీసులు విచారణ జరుపుతున్నారని త్వరలోనే రిపోర్టు వెల్లడిస్తారని మృతుడి కుటుంబ సభ్యులు అరటి యాదయ్య, బాలకృష్ణలు తెలిపారు. ఇదిలా ఉండగా అరవింద్ యాదవ్ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని మరికొందరు అంటున్నారు. మృతుడి స్నేహితులతో సహా ఉద్యోగులను ఆస్ట్రేలియా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలతోనే అరవింద్ మృతి చెంది ఉండవచ్చు అని సహ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అరవింద్ భార్య ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. తల్లి ఉషారాణి షాద్ నగర్ లో ఉన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.