ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, మే 24: విద్యుత్ అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా పనిచేస్తే ఉపేక్షించేది లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విద్యుత్ అధికారులను హెచ్చరించారు.శుక్రవారం గోరి కొత్తపల్లి, రేగొండ మండల కేంద్రాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి విజిట్ చేశారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్లో ఉన్న బుక్స్ తనిఖీ చేయగా, రేగొండ సబ్ స్టేషన్ లాగ్ బుక్ లో మే 22వ తేదీ రోజున వైట్నర్ పెట్టి దిద్దినట్లు ఉంది. దీంతో ఎమ్మెల్యే సంబంధిత ఎఇ, సబ్ స్టేషన్ ఆపరేటర్లను వివరణ అడుగగా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఒకవైపు ప్రభుత్వం నిరంతర విద్యుత్ ను అందిస్తుంటే గ్రామాలకు సమాచారంలేకుండా రేగొండ సబ్ స్టేషన్ పరిధిలో గంటల తరబడి విద్యుత్ సరఫరాలో ఎందుకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ కనకయ్యతో పాటు గోరుకొత్తపల్లి మండలం కోనరావుపేట ఫీడర్లో సుమారు 11 గంటలు కరెంట్ సరఫరా నిలుపుదల చేయడంతో లైన్ మెన్, ఆపరేటర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పమన్నారు. విద్యుత్ సరఫరా లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు అందుకు సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు. సరిగా పని చేయని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ రావు వెంట రేగొండ, గోరి కొత్తపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.