Trending Now

గ్రూప్ -1 పరీక్ష.. కలెక్టర్ కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 30‌ : జిల్లాలో గ్రూప్-I పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణపై నోడల్ అధికారులు, చీఫ్ సూపరిండెంట్లు, సంబంధిత అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-I పరీక్షకు పటిష్ట ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. నిర్మల్ పట్టణంలో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష నిర్వహణలో చీఫ్ సూపరిండెంట్లు, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను ఉదయం 9 గంటల 10 గంటల వరకు అనుమతిస్తారని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల ద్వారా బయోమెట్రిక్ సంతకాన్ని తీసుకుంటామన్నారు. పరీక్ష కేంద్రాల్లోనికి అభ్యర్థులతో పాటు సిబ్బందికి మొబైల్ ఫోన్స్, చేతి గడియారాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆభరణాలు బూట్లు వంటి వాటికి అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థులందరూ హాల్ టికెట్ తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలన్నారు.

అభ్యర్థులు, సిబ్బంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో ఫర్నిచర్, త్రాగునీరు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలని ఆదేశించారు. ప్రతికేంద్రంలో సీసీ కెమెరాల నిఘా లో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్ష పత్రాలు ఇతర సామాగ్రిని తరలించే క్రమంలో రూట్ ఆఫీసర్ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనియా ఘటనలు జరుగకుండా గ్రూప్ -I పరీక్షలను నిర్వహించేలా పోలీస్ శాఖ అన్నీ చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, డి.ఎస్.పి గంగారెడ్డి, ఆర్డీఓ రత్నకళ్యాణి, డీఎం హెచ్ ఓ ధనరాజ్, పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త గంగారెడ్డి, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News