నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 30 : రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వర్షాకాలం నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వలన ఎదురయ్యే సమస్యలు, తీసుకోవలసిన చర్యలపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాల నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో రోడ్లపై వర్షపు నీరు నిలువకుండా డ్రైనేజీలలో చెత్త, వంటి పూడికలు తీసివేయాలని సూచించారు. నాళాలపై ఆక్రమణలను తొలగించాలని, బాద్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నది పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అలాగే పురాతన భవనాలను కూల్చివేయాలని అన్నారు. మురుగునిటీ కాలువలు, రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో దోమలు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని సూచించారు.
నదులు, వాగులలో నీటి ప్రవాహాం అధికంగా ఉండే ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, విపత్తు నిర్వహణ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ అధికారులు జాగ్రత్త వహించాలన్నారు. త్రాగు నీటిని ఖచ్చితంగా క్లోరినేషన్ చేయాలనీ, అధికారులు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, డీఎస్పీ గంగారెడ్డి, నిర్మల్, ముధోల్ ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్ రెడ్డి లు, మున్సిపల్ కమిషనర్ రాజు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, వైద్య శాఖ అధికారి ధనరాజ్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.