ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 1: ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్‌ను ఉత్తరకాండ్ రాష్ట్రంలో అవమానించిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా జిల్లా కేంద్రానికి చెందిన పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు పట్టణ సిఐ అనిల్ కుమార్ కు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్తరకాండ్ రాష్ట్రానికి చెందిన మాజీ ముస్లిం సమీర్ అలియాస్ సిద్ధార్థ చతుర్వేది అనే వ్యక్తి తమ ఇస్లాం పవిత్ర గ్రంధాన్ని కాలితో తొక్కుతూ.. పేజీలను చింపి కాల్చివేసి తమ మనోభావాలను కించపరచడమే కాకుండా తీవ్ర మానసిక శోభకు గురి చేయడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లాంపై విద్వేషపూరిత ప్రచారం చేస్తూ తమ ధర్మానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్న సదరు యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇలాంటి సంఘటనలు దేశంలో ఎక్కడ కూడా పునారావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పారు.
పవిత్ర గ్రంథం అయిన ఖురాన్‌ను అవమానించేవారు ప్రపంచంలో ఎక్కడ కూడా భవిష్యత్తు జీవితాన్ని ప్రశాంతంగా గడిపిన సందర్భాలు లేవన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే పవిత్ర ఖురాన్ ను ఈ తరహాలో అవమానించడమే కాకుండా ఇస్లాం గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్న సదర యువకుడిపై చట్టరీత్య కఠినమైన చర్యలు తీసుకొని దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా దేశ పోలీస్ శాఖపై ఉందని చెప్పారు. ఈ మేరకు సదరు యువకుడిపై పోలీస్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఫసీయోద్దీన్, మహమ్మద్ అబ్దుల్ సమీ, సర్దార్ ఖాన్ తదితరులున్నారు.