Trending Now

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన భూ కబ్జాకోరులు..

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 01: ప్రభుత్వ భూమిని ఇష్టమొచ్చినట్లుగా కబ్జా చేసిన కడవెరుగు రాజనర్సు మారెడ్డి, రవీందర్ రెడ్డి, వంగ ప్రవీణ్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డిల నుండి వెంటనే కబ్జా చేసిన భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ తో పాటు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రాజేశం కు సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ.. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కిందిస్థాయి నాయకులు ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోయారని అన్నారు. ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా వారి వ్యవహార శైలి ఉందని అన్నారు. సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ లో సర్వేనెంబర్ 1340, 1301, 1668 లలో కడవెరుగు రాజనర్సు కొండం సంపత్ రెడ్డిలు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని దీనిపై రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి స్వాధీనం చేసుకోవాలని అన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏ ఇల్లు కట్టుకుందామన్న కొండం సంపత్ రెడ్డి చెప్తేనే ఇంటి నంబర్ గానీ కరెంటు మీటర్ కనెక్షన్ కానీ అధికారులు ఇస్తారని కొండం సంపత్ రెడ్డి చెప్పకుంటే అధికారులు కూడా పనిచేయడం లేదని అన్నారు. అధికారులు ఇకనైనా వారి ప్రవర్తన మార్చుకొని ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో వందల ఎకరాలలో ప్రభుత్వ భూమి ఉంటే సర్పంచ్ కుమారుడు వంగ ప్రవీణ్ రెడ్డి సుడా మాజీ చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని అన్నారు.

మిట్టపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 967. 19. 315/1 నుండి 315/9 వరకు. 333, 312/1. 321/D లలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రెగ్యులరేషన్ చట్టం 15 జీవ కింద దరఖాస్తు చేసుకున్నారని వాటిని వెంటనే పరిశీలించి ప్రవీణ్ రెడ్డి రవీందర్ రెడ్డి లకు చెందిన సంబంధీకులు కానీ కుటుంబ సభ్యులు గాని వారి పేరున ఉంటే వెంటనే ఆ లిస్ట్ నుంచి తొలగించాలని అన్నారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసిన నలుగురిపై రెవెన్యూ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసేలా పోలీసులకు లేఖ రాయాలని అన్నారు. వారి వద్ద నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకపోతే జిల్లా కలెక్టర్ మను చౌదరి ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యాదరి మధు. పట్టణ యువజన అధ్యక్షులు గయాజుద్దీన్. బొమ్మల ప్రవీణ్ సంతోష్ గౌడ్. శేఖర్. రాకేశ్. తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News