నలుగురి మరణం: 13 మందికి గాయాలు
లక్షలాది మందిపై ప్రభావం
ప్రతిపక్షం నేషనల్ బ్యూరో, న్యూఢిల్లీ, జూన్ 1: భారీ వరదలకు మణిపూర్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వరదల ప్రభావంతో ఇప్పటికే నలుగురు మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద ముప్పు ప్రభావం పడింది. రెమాల్ తుపాను కారణంగా భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. 13 మంది గాయపడ్డారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఈ ఈశాన్య రాష్ట్రమంతా భారీ వరదలు వచ్చాయి. ఇంఫాల్ నగరం నుంచి ప్రవహించే చాలా నదులలో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. సహాయ, విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, రాష్ట్రంలో 255 గ్రామాలలో 1,26,950 మంది ప్రభావితమయ్యారు. 16,364 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న 20,504 మంది ప్రజలను తరలించారు. 522 హెక్టార్ల పంట ప్రాంతాలు నష్టపోయాయి. కొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో గత మూడు రోజుల్లో 292 కొండచరియలు విరిగిపడ్డాయి. బాధితుల కోసం 51 సహాయక శిబిరాలను ప్రారంభించినట్లు అధికారిక నివేదిక తెలిపింది. రెండు ప్రధాన నదులు ఇప్పటికే ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.