ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో జనసేన పార్టీ వంద శాతం విజయం వెనుక పవన్ కళ్యాణ్ 17 ఏళ్ల కృషి దాగి ఉందని ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విజేతలతో ఆయన మాట్లాడారు. ‘పవన్ నాయకత్వంలో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాం. అంతే బాధ్యతగా వారి కోసం పనిచేయాలి. ప్రజల సమస్యలు తీరుస్తూ వారికి అండగా నిలబడాలి. జనసైనికులు, వీరమహిళల పోరాటం అద్భుతం’ అని కొనియాడారు.
నిన్న విడుదల చేసిన ఫలితాల్లో జనసేన జయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 21 చోట్లా గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేసింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నట్లుగానే వంద శాతం స్ట్రైక్‌రేట్ సాధించింది. అధికార వైసీపీ సాధించిన సీట్ల కంటే రెట్టింపు సీట్లు గెలిచింది. జగన్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాల్లో పోటీ చేసి, కేవలం 11 స్థానాలకే పరిమితమైతే.. 21 సీట్లలో పోటీ చేసిన జనసేన అన్నింట్లోనూ గెలిచి, సత్తా చాటింది. శాసనసభలో టీడీపీ తర్వాత అత్యధిక స్థానాలున్న రెండో పార్టీగా అవతరించింది. ఈ విజయంతో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ ‘పవర్’స్టార్‌గా నిలిచారు.