Trending Now

గ్రూప్ -1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించండి

నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : ఈ నెల 9 న జరిగే గ్రూప్ -1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణపై పరిశీలకులు, చీఫ్ సూపరిండెంట్లు, రూట్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రూప్ -1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. టీజీపీఎస్సీ కమిషన్ నిబంధనలను అభ్యర్థులు, అధికారులు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

పరీక్ష రాయబోవు అభ్యర్థులకు, విధులు నిర్వహించే సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. అభ్యర్థులంతా తమ హాల్ టికెట్ల పైన తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలని, ఖచ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తమ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, బూట్లు, సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదన్నారు. ఉదయం పదిగంటలలోపు పరీక్ష కేంద్రాలలోకి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదన్నారు.

ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని, పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత పరీక్ష పూర్తయ్యేదాకా బయటకి పోనివ్వడం జరగదని తెలిపారు. పరీక్ష కేంద్రంలో సిబ్బందికి మొబైల్ ఫోన్లు అనుమతి లేదన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష నిర్వహిస్తామని, కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్ష పత్రాలు, సామాగ్రి తరలింపు సమయంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్త గంగారెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News