భారీ ఏర్పాట్లకు సిద్ధమవుతున్న అధిష్ఠానం
ప్రతిపక్షం, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయంతో ఈనెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మెుదట జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ ఆరోజున మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో తేదీని మార్చాల్సి వచ్చింది. మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో సభ నిర్వహిస్తే అందరికీ అనువుగా ఉంటుందని అధిష్ఠానం భావిస్తోంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్య నేతలతో కలిసి ఇవాళ స్థల పరిశీలన చేయనున్నారు. కార్యక్రమానికి మోడీ కూడా హాజరుకానున్న నేపథ్యంలో హైవే పక్కనే స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు టీడీపీ నేతలు చెప్తున్నారు. మరికాసేపట్లో టీడీపీ బృందంతో కలిసి ఆ ప్రాంతాన్ని అచ్చెన్నాయుడు పరిశీలించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్దఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రముఖులు పాల్గొంటున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లను చేయనున్నారు.