ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 10 : రెండు నెలలుగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడంతో ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల శిబిరాన్ని నిలిపివేశారు. మూడు రోజుల క్రితం ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలును ఎన్నికల కమిషన్ ఎత్తివేయడంతో సోమవారం నుండి ప్రజా ఫిర్యాదుల విభాగం శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం అధికారికంగా ప్రకటించడంతో సోమవారం జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కి ఇచ్చి సమస్యలను పరిష్కారం చేయాలంటూ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ఆర్జీదారుల ఆర్జీలను స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించుచున్నదని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ బైంసా ముధోల్ లతోపాటు పలు మండలాలు గ్రామాల నుంచి ఆర్జిదారులు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి సోమవారం ఉదయం నుంచి చేరుకున్నారు. ప్రజా ఆర్జీల స్వీకరణ విభాగంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తోపాటు జిల్లాలోని మండల ,జిల్లా, డివిజన్ స్థాయి శాఖల అధికారులు పాల్గొన్నారు.