వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 11 : భారీవర్షాలు, వరదల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై ఆమె రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాకాలం సమీపించినందున వరదల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిజినల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. క్లోరినేషన్ చేపట్టిన తర్వాతే ప్రజలకు త్రాగు నీటిని సరఫరా చేయాలని, పురాతన ఇండ్లలో నివాసం ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని, ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పంపిణీ చేయు ఏకరూప దుస్తుల తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్షాకాలం ఇబ్బందులు ఏర్పడకుండా తీసుకుంటున్న చర్యలు, మిషన్ భగీరథ సర్వే, ఏకరూప దుస్తుల తయారీ వంటి అంశాలపై జిల్లాల వారీగా మంత్రి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు, వరదల వలన ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తామని, నిర్ణిత గడువులోగా ఏకరూప దుస్తుల తయారీని పూర్తి చేస్తామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జెడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీఓ విజయలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ సందీప్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.