ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 11 : తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో విజయపాథలాజికల్ ల్యాబరేటరీ కార్యాలయంలో రామోజీరావు గ్రూపు సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావుకు సంతాపసభను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, పువ్వులను సమర్పించి, ఐదు నిమిషాలు మౌనం పాటించారు. శ్రద్ధాంజలిని ఘటించి,కవితాగానం, కవితాక్షర నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. విశ్వమానవాళి ప్రయోజనాలకోసం ప్రపంచ స్థాయిలో అమూల్యమైన సేవలు అందించిన రామోజీరావు గొప్పకీర్తిని కొనియాడారు.
తెలుగువారి సామాజిక రాజకీయ చరిత్రను ప్రభావితం చేసిన అజేయుడని, పద్మ విభూషణ్ పురస్కారం వరకు స్వశక్తితో ఎదిగి,ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకు అన్నదాతై నిలిచిన అసామాన్యుడు రామోజీరావేనని అన్నారు. అంతర్జాతీయ జాతీయ, రాష్ట్రీయ ప్రాంతీయ వార్తలను ఈనాడు పత్రిక, ఈటీవిల ద్వారా అక్షరానికి ఆయుధమై ప్రజాప్రయోజనాలే పరమావధిగా భావించిన విశ్వమార్గదర్శకుని అన్నారు. ఈటీవీ న్యూస్ ఛానల్ తో తెలుగునాట తొలినాళ్ళలో 24 గంటల వార్తాస్రవంతికి శ్రీకారం చుట్టిన దృశ్య దార్శనికుడని అన్నారు.
ఈటీవీ భారత్, పలు భాషల్లో ఛానల్ లను నడిపించిన నేటి కంప్యుటర్ మేధావియని, వర్తమానాన్ని దాటి చూడగలిగిన దార్శనికుడని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడిన అక్షరయోధుడని, నిత్య ఉషస్సులను ప్రసరించే చల్లని భానుడని,ప్రపంచానికి ప్రియాపచ్చల్లను రుచిచూపించారని అన్నారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా అనేక చిత్రాలను నిర్మించిన భావినిర్మాతయని, నేటి ప్రపంచ కాలానికి అక్షర కారణజన్ముడని అన్నారు. ప్రముఖ కవులు ఉప్పు కృష్ణంరాజు, పత్తి శివప్రసాద్, తుమ్మల దేవరావు, పోలీస్ భీమేష్, కామారపు జగదీశ్వర్, శనిగారపు నాగరాజు, నాగారాం, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.