Trending Now

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వసతులు..

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 12 : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్నీ వసతులు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం ఖానాపూర్ మండలం మస్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కు విద్యార్థులు, ఉపాధ్యాయులు పూల బొకే ను అందించి, బ్యాండు మేళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. బడి ఈడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్య బోధన, ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్య, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనాల వంటి ఎన్నో ప్రభుత్వం ప్రోత్సహకాలు అందించడం జరుగుతుందని తెలిపారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో త్రాగునీరు, మరుగు దొడ్లు, విద్యుత్, వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. గత పదవ తరగతి ఫలితాల్లో 9.8 జిపిఏతో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన నలుగురు విద్యార్థులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలుపుతూ, దీనిని ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఐఐఐటీ, ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలలలో వంద శాతం హాజరు నమోదయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేశారు. బడిబాట కార్యక్రమ పోస్టర్ ను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అంతకుముందు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన మరుగు దొడ్లు, త్రాగు నీరు, విద్యుత్ మరమ్మత్తు పనులను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ రెడ్డి ఈనెల పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఆయనను కలెక్టర్ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కేజీబీవీ పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, త్రాగునీటిని అందించాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో డీఈవో రవీందర్ రెడ్డి, తహసిల్దార్ శివరాజ్, ఎంపీడీవో సునీత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులు హసీనా, ఎంపీపీ అబ్దుల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News