Trending Now

మహిళా మంత్రుల మధ్య ఆధిపత్య పోరు..?

హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క మధ్య ఆధిపత్య పోరు కాస్తా ముదురుతున్నది. రాజకీయాలు, పాలనా విషయాల్లో ఒకరి మీద ఒకరు పైచేయి సాధించేందుకు ఇద్దరూ పోటాపోటీ వ్యూహాలను అమలు చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం జరిగిన మేడారం జాతర సమయంలో మొదలైన పంచాయితీ కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జీ మార్పు విషయంలో తీవ్రస్థాయికి చేరింది. వరంగల్‌లోని ధార్మిక భవన్‌ నుండి కార్యకలాపాలు నిర్వహించాలని దేవాదాయ శాఖా మంత్రి అయిన కొండా సురేఖ భావిస్తున్నది. అయితే ధార్మిక భవన్‌ను వేరే వాటి కోసం వినియోగించే ఆలోచన చేయడం సరికాదని సీతక్క వర్గీయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ధార్మిక భవన్‌లో సమ్కక్క-సారలమ్మ ఈవో ఆఫీసును కొనసాగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు మేడారంలో పూజలు నిలిపివేస్తామని అక్కడి పూజారులు ఇటీవల ప్రకటించారు. దీని వెనక సీతక్క హస్తం ఉందన్నది కొండా సురేఖ వర్గీయుల వాదన. ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతర విషయంలోనూ ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో సమ్మక్క సారలమ్మ దేవాలయం ఉంది. ఈ జాతర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరగాలి. జాతరలో కీలకంగా వ్యవహరించాలని కొండా సురేఖ ఒకటి రెండు సమీక్షలకు వెళ్లగా పనుల ప్రతిపాదన, వాటిని పూర్తి చేయడం, జాతర నిర్వహణలో ఏర్పాట్లపై ఇద్దరి నడుమ విభేదాలు నెలకొన్నాయి. దీంతో జాతర వైపు కొండా సురేఖ మళ్లి చూడలేదు.

సీఎం రేవంత్‌రెడ్డి జాతరకు వచ్చిన రోజు మాత్రం అక్కడకు వచ్చి వెళ్లారు. జాతర నిర్వహణ, పనుల పర్యవేక్షణ అంతా సీతక్కే చూసుకున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ ఇన్‌చార్జిగా ఉన్న కొండా సురేఖను బాధ్యతల నుంచి తప్పించి మెదక్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పార్టీ ప్రకటించింది. సీతక్క సూచనలతోనే సొంత సెగ్మెంట్‌ నుంచి కొండా సురేఖను దూరం పెట్టారని ఆమె వర్గీయులు ఆనాడే అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి చెందిన మేయర్‌ గుండు సుధారాణిని తనకు సమాచారం లేకుండా సీతక్క ప్రమేయంతోనే కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని సురేఖ అసంతృప్తితో ఉన్నారు. మెదక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ ఓడిపోగా, వరంగల్ లో విజయం సాధించింది. దీని మీద కూడా కొండా సురేఖ వర్గీయులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ వివాదానికి ఎక్కడ ముగింపు లభిస్తుందో వేచిచూడాలి.

Spread the love

Related News

Latest News