ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 13: నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ హజరత్ సోఫీ హుస్సేన్ అలీషా ఖాద్రీ సత్తారీ రహమతుల్ ఆలై వారి ఉర్సే – ఏ – షరీఫ్ ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఈనెల 22,23,24 ను మూడు రోజులపాటు ప్రతి ఏడాది మాదిరి ఈ యేడు కూడా ఆనవాయితీగా ఈ ఉత్సవాలను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అన్ని సామాజిక వర్గాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొనడం ఆనవాయితీ. 88 వ ఉర్సే – ఏ – షరీఫ్ ఉత్సవాల కోసం వారం రోజుల ముందు నుంచి ఏర్పాటు చేస్తుంటారు.
ఇక్కడ పెద్ద జాతర ఏర్పడడంతోపాటు మొదటి రోజు హజరత్ వారి గంధం శోభాయాత్ర నిర్వహించి దర్గాలోని స్మృతి సమాధిపై పూల చాదర్లు, దుస్తుల చాదర్లు వేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. మత గురువుల ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఖవ్వాళీ, సమా, కార్యక్రమాలు మూడవ రోజు ఉంటుంది. ఉర్సు ఉత్సవాల సందర్భంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని రోజువారీగా నిర్వహిస్తుంటారు. మున్సిపల్ చైర్మన్ గంట ఈశ్వర్ తో పాటు దర్గా నిర్వాహకులు సోఫీ సమద్ పాష ఖాద్రీ వ శుత్తారి స్థానిక కౌన్సిలర్ మహమ్మద్ అబ్దుల్ మతిన్, ముజాహిద్ చావుష్, మొహమ్మద్ అన్వర్ పాషా, సయ్యద్ జలీల్ అజహార్, మైనార్టీ నాయకులు సయ్యద్ మఖ్బుల్, మహమ్మద్ జావేద్, మహమ్మద్ జీషాన్, భూపతి,భీమన్న తదితరులు ఉన్నారు.