ప్రతిపక్షం, ప్రతినిధి సిద్దిపేట, జూన్ 13: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సిద్దిపేట మొట్ట మొదటి శాసనసభ్యులు ఎడ్ల గురువారెడ్డి సేవలు, అభివృద్ధి మరవలేనివని, చిరస్మరణీయంగా గుర్తిండిపోతాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం రోజున ఎడ్ల గురువారెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రాంతం అభివృద్ధి చెందిందంటే మొదట బీజం వేసింది ఎడ్ల గురువారెడ్డి అని అన్నారు. ఆయన మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరవాత సిద్దిపేటకు కరెంటు తీసుకువచ్చారని, అదే విధంగా పేద విద్యార్థులకు,మారుమూల గ్రామాల వారికి ఉన్నత విద్య అందాలని సిద్దిపేటకు డిగ్రీ కళాశాలను మంజూరు చేపించి స్థాపించారని ఆయన గుర్తు చేశారు.
ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా పని చేసినప్పటికీ సాదాసీదా జీవితాన్ని గడిపారని, అదే విధంగా తన కు వచ్చిన వేతనాన్ని డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఇచ్చే వారన్నారు. తన పదవి దిగిన తర్వాత వచ్చిన పెన్షన్ ను భారత కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చే వారని, ప్రజలకోసం,సిద్దిపేట ప్రాంతం కోసం నిరంతరం ఆలోచించిన గొప్ప నాయకులు ఎడ్ల గురువారెడ్డి అని కొనియాడారు. ఆయనను స్పూర్తిగా తీసుకుని,ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే ఇజేయు) జిల్లా అధ్యక్షులు రంగాచారి, మాజీ జేఏసీ చైర్మన్ పాపయ్య, సీపీఐ సీనియర్ నాయకులు ఎడ్ల వెంకటరామిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కిష్టపురం లక్ష్మణ్, కనుకుంట్ల శంకర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈరి భూమయ్య, పిట్ల మల్లేశం, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ నాయకులు బేక్కంటి సంపత్, బిక్షపతి, ప్రసన్నకుమార్, సుధాకర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.