ప్రతిపక్షం, ప్రతినిధి సిద్దిపేట, జూన్ 13: ఆశాలకు నష్టం కల్గించే, ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ.. సిద్ధిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. గురువారం రోజున ఆశలకు ఎగ్జామినేషన్ రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవధ్యక్షులు జి. భాస్కర్ మట్లాడుతూ.. తేలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతంలో గత 33 సం||లు, మైదాన ప్రాంతంలో గత 19 సంవత్సరాల నుండి పని చేస్తున్నారని. ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రభుత్వ నిర్వహించిన అనేక ట్రైనింగ్ లు పొందారు. రిజిస్టర్స్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్ పని చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర అన్నిరకాల జబ్బులను గుర్తిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నారు.
తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నారు. వీటితో పాటు గర్భిణీ, బాలింతలు, చిన్న పిల్లలకు, ఇతర ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారని కరోనా మహమ్మారి కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషించారు. (డబ్ల్యుహెచ్ఓ) ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశా వర్కర్లకు అవార్డును కూడా ప్రకటించింది. ఇన్ని పనులు నిర్వహిస్తూ, ఇంత సీనియారిటీ ఉన్న ఆశా వర్కర్లకు మళ్ళీ కొత్తగా ఎగ్జామ్స్ నిర్వహించి కొత్తగా ఆశాల జ్ఞాపకశక్తిని మళ్ళీ నిరూపించుకోవాలని చెప్పడం సమంజసం కాదన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయాన్ని ముందుకు తెచ్చి అమలు చేయాలని చూసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు పెద్దఎత్తున పోరాటాలు చేశారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. ఆశాలకు ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ వల్ల ఆశాలకు కలిగే లాభాలు ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్లో ఏమీ లేవని, ఏఎన్ఎం ప్రమోషన్ లాంటి తదితర ఎలాంటి సౌకర్యాలు అందులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశాలు అనేక సంవత్సరాల నుండి కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఆశాలకు నష్టం కల్గించే ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భగా విధులు నిర్వహించిన ఆశాలకు డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆశాల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి బీ. ప్రవీణ, ఆశ వర్కర్లు శ్యామల, శారద, బాలమణి, మాలతి, కవిత, సుజాత, బాలమణి వరలక్ష్మి నీరజ భూలక్ష్మి, శ్యామల, వసంత, మంజుల,కవిత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.