ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 15 : అన్ని వర్గాలకు సమన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని రాష్ట్ర హస్తకళ సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని 30 పడకల ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలలో అయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా రక్తదానం నిర్వహించి అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హస్తకళ సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణచే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం లోని అన్ని వర్గాలకు వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాల ద్వారా ఫలాలు దక్కుతాయని చెప్పారు.
దేశ చరిత్రలోనే ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే ఇచ్చిన 6 గ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేసిన ఘనత లేదని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లు సమన్వయంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వినూత్నమైన సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రణాళికబద్ధమైన రీతిలో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలను అవగాహన కల్పించడంతోపాటు తద్వారా అర్హులైన వారు లబ్ధి పొందేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తపై ఉందని చెప్పారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను జరుపుకోవడం అభినందనీయమని చెప్పారు.
సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మహోన్నతమైన కార్యమని చెప్పారు. సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ.. చేసిన పాదయాత్రకు ప్రజలు తగిన ఫలితాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఉపముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే దిశగా ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు దేవేందర్ రెడ్డి ,తాజా మాజీ సర్పంచ్ అరుగుమిది రాం రెడ్డి, నర్సాపూర్ ( జి) జడ్పీటీసీ రామయ్య, కుంటాల జడ్పీటీసీ గంగామణి బుచ్చన్న, సుంకేట పోశెటి, అనుముల భాస్కర్ లతో పాటు పలువురు కాంగ్రెస్ ఆయా విభాగాల పదాధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.