సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్
ఓ ఐసీసీ కప్ సాధించాలన్న సౌతాఫ్రికా కల నెరవేరడం లేదు. టీ20 ప్రపంచకప్ చేతికందినట్టే అంది చేజారిపోయింది. అది సౌతాఫ్రికా క్రీడాకారులను, అభిమానులను తీవ్రంగా బాధ పెడుతోంది. ఫైనల్ మ్యాచ్ ముగిసి మూడు రోజులవుతున్నా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నానని సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఆవేదన చెందుతున్నాడు. శనివారం జరిగిన టీ20 ఫైనల్ లో సౌతాఫ్రికా ఏడు పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓడింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు అవసరం అయినప్పుడు మిల్లర్ తొలి బంతికే ఔటయ్యాడు. భారీ సిక్సర్ బాదబోయి బౌండరీ లైన్ మీద సూర్యకుమార్ యాదవ్ సంచలన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. ఆ బంతి సిక్సర్‌గా వెళ్లినా, మిల్లర్ నాటౌట్‌గా నిలిచినా సౌతాఫ్రికా సునాయసంగా గెలిచి ఉండేది. యేండ్ల నిరీక్షణకు తెరపడేది. ఈ పరాజయం అనంతరం మిల్లర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. తన సతీమణి భుజాల మీద తలపెట్టి ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తన వల్లే సౌతాఫ్రికా ఓడిందనే బాధ అతన్ని బాగా వెంటాడుతోంది.