మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..
ప్రతిపక్షం, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పనికిరాకుండా పోతున్నాయని పట్టణానికి చెందిన క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఎల్లమ్మ చెరువు కట్ట కింద క్రీడాకారుల కోసం కొంత స్థలాన్ని అధికారులు కేటాయించారు. కానీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో క్రీడా ప్రాంగణం శుక్రవారం జరిగే పశువుల సంతకు నిలయంగా మారింది. క్రీడా ప్రాంగణాన్ని క్రీడాకారులు వినియోగించుకోవడం పక్కన పెడితే.. పశువుల క్రయ, విక్రయదారులు మాత్రం పశువుల సంతకు చక్కగా వినియోగించుకుంటున్నాయని క్రీడాకారులు ఆవేదన వ్యక్తంచేశారు.
హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణం నామ మాత్రంగానే మిగిలిపోయిందని.. వచ్చిన నిధులు తూ.. తూ.. మంత్రంగా వెచ్చించిన నాటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ నిధులను పక్కదారి పట్టించి తమ జేబులను నింపుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు క్రీడా మైదానాన్ని క్రీడాకారులకు కిటాయించాలని పశువుల సంతను వేరే చోటికి మార్చాలని క్రీడాకారులు కోరుతున్నారు.