మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ప్రతిపక్షం, ప్రతినిధి, హనుమకొండ జులై 4: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినట్లు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గంలో పరకాల, నడికూడా, ఆత్మకూర్, దామెర మండలాల పదవీకాలం ముగిసిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు హనుమకొండలోని వారి నివాసంలో చల్లా ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులను సన్మానించారు. అనంతరం ధర్మారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవి విరమణ సహజమేనని అన్నారు. పరకాల నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామ అభివృద్ధి చెందాయని అందులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ప్రధానమైనదన్నారు. ఉత్తమ సేవలతోనే ప్రజాప్రతినిధులకు గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. పదవి లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని, రానున్నరోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ లు తదితరులు పాల్గొన్నారు.