కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
ప్రతిపక్షం, ప్రతినిధి నిజామాబాద్, జూలై 04 : ధరణి దరఖాస్తులను పరిష్కరించే విషయంలో జాప్యం చేయరాదని, యుద్దప్రాతిపదికన పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి, ధరణి దరఖాస్తుల పరిశీలన, వాటి పరిష్కారం తీరుపై స్థానిక రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఆర్మూర్ మండలం పరిధిలో ఆయా మాడ్యూల్స్‌లో పెండింగ్‌లో గల ధరణి దరఖాస్తులు ఎన్ని, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యాలయంలో ఎక్కువ సంఖ్యలో ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం పట్ల కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా సూచిస్తున్నప్పటికీ వాటి పరిష్కారం విషయంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, రికార్డుల ఆధారంగా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన ప్రగతి గురించి రోజువారీగా నిశిత పరిశీలన జరపాలని ఆర్డీఓకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, సంబంధిత అధికారులు ఉన్నారు.