ప్రతిపక్షం, హుస్నాబాద్ : వన మహోత్సవం కార్యక్రమం ద్వారా హుస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తల్లి పేరు మీద ప్రతి ఒక్కరు ఒక మొక్కలు నాటాలని దేశ ప్రధానమంత్రి చెప్పారు. మీరు కూడా మీకు ఇష్టమైన వారి పేరు మీద మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలి. మాస్కు, ఆక్సిజన్ ఎప్పటికీ పెట్టుకునే రోజులు రాకూడదంటే మన తక్షణ కర్తవ్యం వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలను నాటి సంరక్షించుకోవడమే. సమాజంలో భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండి ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలి. జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటుటకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా వన మహోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలి. ప్రభుత్వం మోడల్ స్కూల్ అందరిదీ.. తర్వాత జనరేషన్ విద్యార్థులకు మంచిగా అందించేలా ప్రస్తుత విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకోవాలి. పాఠశాలలో అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మన వాతావరణాన్ని క్లీన్‌గా, గ్రీన్ గా ఉంచుకోవాలంటే మొక్కలను నాటి పెద్ద చేయడం ఒకటే మార్గం. గ్రీనరీ ని పెంచుటకు ప్రతి ఒక్క విద్యార్థి ఒక మొక్కను నాటి దాన్ని సురక్షితంగా సంరక్షించాలి. గెలుపు, ఓటములు సాధారణం ప్రతి విద్యార్థి తప్పనిసరిగా అన్ని రకాల కాంపిటేషన్లలో పాల్గొనాలి. తద్వారా జీవితంలో ఏ విషయంలోనైనా కాన్ఫిడెన్స్ పెరుగుతందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరీమ అగ్రవాల్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న, జిల్లా అటవీశాఖ అధికారి శ్రీనివాస్, హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.