బంగ్లాదేశ్‌లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు రాజకీయ అనిశ్చితి, మరోవైపు ప్రకృత్రి ప్రకోపం ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు బంగ్లాదేశీయుల పట్ల శాపంగా మారాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆగ్నేయ ప్రాంతంలో భీకర వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఈ కారణంగా 9 జిల్లాల్లో మొత్తం 9,28,000 మంది అంధకారంలోకి వెళ్లిపోయారు. వరద ప్రభావిత జిల్లా అయిన ఫెనిలో మొత్తం 17 సబ్‌స్టేషన్లు మూసివేశారు. వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు 18 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా 4.9 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారని, మొత్తం 9, 44,548 కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోగా; 2,84,888 మంది ప్రజలు; 21,695 పశువులు ఆశ్రయ కేంద్రాల్లో వసతి పొందుతున్నట్లు అధికారులు స్పష్టంచేశారు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అయితే, ప్రజాస్వామ్యాయుత ప్రభుత్వం లేనందున సహాయక చర్యలు పటిష్టంగా సాగడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.