CM Revanth Reddy About HYDRA: హైడ్రా, అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాప ఉత్సవానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదని, హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా..మిత్రుల ఫాంహౌస్‌లు ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని, చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతామన్నారు.
అక్రమ కూల్చివేతలకు భగవద్గీతే స్ఫూర్తి అని, శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నామని సీఎం రేవంత్ అన్నారు. గండిపేట, ఉస్మాన్ సాగర్‌లు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయని, హైదరాబాద్ లేక్ సిటీ అని రేవంత్ వెల్లడించారు. అక్రమ నిర్మాణాలు రాజకీయం కోసమో, నాయకులపై కక్ష్య కోసం చేయడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే..నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టేనని చెప్పారు. చెరువుల పక్కన కొంతమంది శ్రీమంతులు ఫాంహౌస్‌లు కట్టుకున్నారని, ఆ ఫాంహౌస్ నాలాలు గండిపేటలో కలిపారన్నారు. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని వెల్లడించారు.