Asaduddin Owaisi Comments on HYDRA: హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామనడం సరికాదన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ప్రైవేట్ కట్టడాలతోపాటు ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఫౌంటేన్ వద్ద ఉండేదని, నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందన్నారు. మరి వీటిని కూడా కూలుస్తారా? అని ప్రశ్నించారు.
హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో బల్డియా భవనాన్ని నిర్మించారని, ఉస్మాన్ సాగర్ సమీపంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఎంబీ ఉందని ఒవైసీ వెల్లడించారు. మరి వీటికి కూడా కూల్చేస్తారా? అని ఒవైసీ అడిగారు. ఎవరికైనా అనుమానం ఉంటే బఫర్ జోన్ పరిధిలో గతంలో స్టోన్స్ పెట్టేవారన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా..అక్రమ నిర్మాణాల కూల్చివేతలో దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌తో పాటు పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది.