ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఒకటి. ఇప్పటికే ‘ది లయన్ కింగ్’ చిత్రాలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ కోసమైతే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇవాళ ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో విశేషమేమంటే కీలకమైన ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించారు. ఇందులో మహేష్ డైలాగ్స్‌కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి, నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే అవి మాయమవుతున్నాయి’ అంటూ మహేశ్ చెప్పే డైలాగ్స్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్ ఆద్యంతం అలరించేలా సాగింది. ‘తెలుగులో ‘ముఫాసా’కు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’ అంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ కూడా చేశారు.