కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా మాట్లాడుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్‌ను ఉచితంగా అమలు చేస్తామని, ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్‌ను పూర్తి ఉచితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ స్థాయి నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు నిత్యం ఫోన్లు చేస్తూ ప్రజలను వేధిస్తున్నారని, ఫీజులు చెల్లించకుంటే లే అవుట్లు రద్దు చేస్తామంటూ భయాందోళనలకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ టార్గెట్లు పెట్టి మరీ మొత్తం రూ.15 వేల కోట్లు వసూళ్లు చేయాలని ఆదేశాలివ్వడం ప్రజల రక్త మాంసాలను పీల్చడమేనని దుయ్యబట్టారు. ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.