గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట వెలసిన ఓ ఫ్లెక్సీ రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో ‘మహానగర పాలక సంస్థ – వరంగల్’ పేరిట ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం దేనికి సంకేతమన్నారు. ఇది అధికారిక నిర్ణయమా? లేక అధికారుల నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. ఆ పోస్టును సీఎస్ శాంతికుమారికి ట్యాగ్ చేశారు.
‘అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా? తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్‌లతో ఈ వెకిలి పనులేంటి? ఈ కొత్త చిహ్నాన్ని ఎవరు? ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుగొని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని కేటీఆర్ పేర్కొన్నారు.