Trending Now

Kota Gullu: నేడు కోటగుళ్లు సందర్శనకు గవర్నర్.. ఆలయ అభివృద్ధిపై స్థానికుల్లో చిగురిస్తున్న ఆశలు!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపవరంలోని కోటగుళ్లు.. శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయాన్ని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఇవాళ సందర్శించనున్నారు. దీంతో ఈ ఆలయం మరొకసారి వార్తల్లో నిలిచింది. అయితే, కోటగుళ్ల ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. ప్రతాపరుద్రుడు 1213 సంవత్సరంలో వరంగల్‌లో ఉన్న వెయ్యి స్థంబాల గుడితో పాటే దీనిని నిర్మించారు. ఇందులో 22 ఉప ఆలయాలు ఉన్నాయి. ఉత్తరాన కాటేశ్వరాలయం, దక్షిణాన నర్తనశాల, తూర్పున నంది మండపం ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే ఓ పెద్ద చెరువు కూడా ఉంది. ఇక్కడిని నిత్యం అనేక మంది భక్తులు వస్తుంటారు.

అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ ఆలయానికి గతంలో 60 ఎకరాల పైనే స్థలం ఉండేది. కానీ ప్రస్తుతం 8 ఎకరాలు మాత్రమే ఆలయం పరిధిలో ఉంది. మిగతా భూమి ఏమైందన్న దానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు, ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశేష చరిత్ర ఉన్న ఈ ఆలయం నేటి వరకు రిజిస్ట్రేషన్ కాకపోవడం దురదృష్టకరమని వాపోతున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆలయాల పునరుద్ధరణకు, పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుండటంతో కోటగుళ్లు ఆలయ అభివృద్ధిపై స్థానికులకు ఆశలు చిగురిస్తున్నాయి. నేడు గవర్నర్ ఆలయాన్ని సందర్శించడానికి వస్తుండడంతో ఆలయ అభివృద్ధి జరుగుతుందని, దేవాదాయశాఖ ఆధీనంలోకి వెళ్లేలాగా గవర్నర్ చర్యలు తీసుకుంటారని భక్తులు, స్థానికులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 7 కోట్లు కేటాయించాలని, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News