ప్రతిపక్షం, దుబ్బాక, మార్చి25: భవనం పై నుండి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి దుబ్బాకలో చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన పోతరాజు లింగం వయసు( 37 )సంవత్సరాలు గ్రామంలో మెకానిక్ గా పని చేస్తూ.. భార్యతో కలిసి దుబ్బాక పట్టణంలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి తాను అంటున్న మొదటి అంతస్తు నుండి ఇంటిలో ఉన్న చెత్త కవర్ ను బయటకు విసిరే క్రమంలో భవనంపై నుండి కాలుజారి క్రింద పడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఇంటి యజమాని సహాయంతో అతని భార్య అతడిని చికిత్స కోసం దుబ్బాక పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా వెంటనే వైద్యులు పరీక్షించి అతడు మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య వేదశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.