ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూలై 0 4: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తాలో నిర్మిస్తున్న స్వాతంత్ర సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ క్లాక్ టవర్ నిర్మాణ పనులను వెంటనే పునః ప్రారంభించాలని కోరుతూ.. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా శాఖ బాధ్యులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 22 సంవత్సరాలుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారక క్లాక్ టవర్ నిర్మాణం కోసం సొసైటీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తే రెండున్నర సంవత్సరాల క్రితం 50 లక్షల రూపాయలతో పనులకు అప్పటి రాష్ట్ర మంత్రి కల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి చే శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించి 25 శాతం పనులు పూర్తి చేయకుండానే నిలిపివేశారని పేర్కొన్నారు.
8 నెలలుగా మౌలానా ఆజాద్ స్మారక క్లాక్ టవర్ నిర్మాణ పనులు నిలిచిపోగా.. పనులలో కాంట్రాక్టర్ కనీస నాణ్యతను పాటించడం లేదని వారు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ క్లాక్ క్లాస్ నిర్మాణ పనులను ఆజాద్ జయంతి ఉత్సవాల లోపు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపక, జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్, ఉపాధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మొహమ్మద్ బిన్ అలీ, శేఖ్ ఇంతియాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇంతియాజ్, పట్టణ ఉపాధ్యక్షులు సయ్యద్ అమీన్ బాబా, యువజన విభాగం అధ్యక్షులు శేఖ్ షకీల్ తదితరులు పాల్గొన్నారు.