ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి..
ప్రతిపక్షం, సిద్దిపేట మార్చ్ 30: రాబోయే ఎంపీ ఎన్నికల్లో విద్య వ్యతిరేక విధానాలను ఆవలంభించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, జిల్లా నిర్మాణ బాధ్యులు మంద పవన్ లు పిలుపునిచ్చారు. శనివారం రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ఆఫీసు బేరర్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ మౌళిక సూత్రాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం(ఎన్ఇపి)-2020 లోపాలపుట్టని, విద్యా కాషాయీకరణ, విద్యా ప్రైవేటీకరణ, విద్యా కేంద్రీకరణ కోసమే నూతన విద్యా విధానమని, ప్రజలందరూ దీనిని తిరస్కరించాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని, దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యావిధానం-2020 తీసుకొచ్చారని విమర్శించారు. ఈ విద్యా విధానంలో ప్రైవేటు విశ్వవిద్యాలయలను, విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతిస్తారని తెలిపారు. ఇలాంటి లోపాల పుట్ట ఉన్న నూతన జాతీయ విద్యా విధానంను ప్రజలందరూ తిరస్కరించాలని అన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక మూడు రాష్ట్రాలు నూతన జాతీయ విద్యా విధానం తిరస్కరిస్తున్నట్లు తీర్మానం చేశాయని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా నూతన జాతీయ విద్యా విధానం వ్యతిరేకిస్తున్నట్లు అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశ అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గా వేల్పుల ప్రసన్న కుమార్, గర్ల్స్ కన్వీనర్ గా ఆకుల శిరీష ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంగెం మధు, జేరిపోతుల జనార్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామగళ్ల నరేష్ లు పాల్గొన్నారు.