చైనాపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా అవలంభిస్తున్న విధానాలతో భారత్‌తో పాటు అనేక దేశాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రముఖ పత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘సరిహద్దు వివాదం కారణంగా చైనాతో మనకు సమస్య ఉంది. అయితే చైనాతో ఈ సమస్యకు మనకు మాత్రమే కాదు. ప్రపంచంలోని పలు దేశాలూ తలనొప్పి ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ఆ దేశం గురించి చర్చించుకుంటూ ఉంటారు. యూరప్ వెళితే చైనా నుంచి ఎదురవుతున్న ఆర్థిక, జాతీయభద్రత ముప్పు గురించి ప్రస్తావిస్తారు. అమెరికా వెళ్లినా ఇదే సమస్య. కాబట్టి చైనాతో భారత్‌కు మాత్రమే సమస్య అని భావించకూడదు’ అని అన్నారు.
దశాబ్దాల క్రితం ప్రపంచదేశాలు చైనా సమస్యను పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారిందని అన్నారు. ఇక చైనా నుంచి పెట్టుబడుల గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. చైనా నుంచి పెట్టుబడులు ఆహ్వానించకూడదని గానీ, ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు నెరపకూడదని గానీ ప్రభుత్వం అనుకోవడం లేదన్నారు. అక్కడి నుంచి వచ్చే పెట్టుబడుల విషయంలో నిశిత పరిశీలన అవసరమని చెప్పారు.