ప్రతిపక్షం, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభతో పాటు లోక్ సభ ఎన్నికలకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు ఒక కొలిక్కి వచ్చినట్లే. ఏ స్థానాలు ఎవరికి అనే దానిపై అధికారిక ప్రకటన రావడమే మిగిలింది. మొత్తం 25 ఎంపీ స్థానాలకు బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేసేందుకు అవగహన కుదిరింది. శాసనసభ స్థానాలకు సంబంధించి 175 నియోజకవర్గాలకు గాను, బీజేపీ 10, జనసేన 21 చోట్ల పోటీ చేస్తాయి. మిగతా వాటిలో తెలుగుదేశం తలపడుతుంది.
టీడీపీ, జనసేన విడుదల చేసిన మొదటి జాబితా ప్రకారం.. జనసేన 24 అసెంబ్లీ స్ధానాలలో అభ్యర్థులను నిలపవలసి ఉంది. బీజేపీతో మిత్రత్వం ఖరారైన తరువాత మూటింటిని వదులుకుంది. బీజేపీ ఎన్నికల్లో అస్తిత్వం చూపేందుకు టీడీపీ, ‘సేన’తో సీట్ల బేరానికి వచ్చిందని, ఒకవేళ ఆ పార్టీ లోక్ సభకు పోటీ చేయకపోయినా, రాష్ట్రంలో ఎవరు (టీడీపీ, వైసీపీ) నెగ్గినా బేషరతుగా మద్దతు ఉంటుందనడం కాదనలేనిదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు ఎవరి లెక్కలు వారివి మరి!