ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కలు వెంటనే జిల్లాలో అర్హులైన వికలాంగులకు ఇచ్చిన హామీలన్నిటిని నేరవేర్చాలని కోరుతూ.. నిర్మల్ జిల్లా కలెక్టర్ వద్ద వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శుక్రవారం నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను ఆదుకునేందుకు ఇచ్చిన హామీలన్నిటిని నేరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్న తమ పట్ల కనీస శ్రద్ధచూపడం లేదని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర మంత్రి సీతక్కను ఈ విషయమై మూడుసార్లు వ్యక్తిగతంగా కలిసి వినతి పత్రాలు సమర్పించుకున్న ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. నిర్మల్ జిల్లాలోని అర్హులైన వికలాంగులందరికీ వెంటనే డబుల్ బెడ్ రూం లు, ఇంటి స్థలాలు, పెన్షన్లు బ్యాక్లాగ్ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేచి చూడడం జరిగిందని అయితే ఫలితం లేకపోవడంతోనే ఆందోళనకు దిగవలసి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
జిల్లాలో సకలాంగులకు వికలాంగుల సర్టిఫికెట్లను మంజూరు చేసే మూట తయారైందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసిన న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన వికలాంగులు దీంతో పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. జిల్లాలో అక్రమంగా వికలాంగుల అర్హత ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్న సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది మధ్య దళారులను గుర్తించి వెంటనే కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు సంఘం మహిళా ఇతర నాయకులు పాల్గొన్నారు.