రచయిత, జర్నలిస్టు డా. పొన్నం రవిచంద్ర
ప్రతిపక్షం, హైదరాబాద్, నవంబర్10: అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ రంగానికి తీరని లోటని రచయిత, జర్నలిస్టు డా. పొన్నం రవిచంద్ర అన్నారు. ప్రముఖ కవి, గేయ రచయిత అందేశ్రీ ఆకస్మిక మరణం పట్ల పొన్నం రవిచంద్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ“ సృష్టికర్త ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తన ఈ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని, అందెశ్రీని తాను నంది అవార్డుల జ్యూరీ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆయన ఉత్తమ గేయ రచయితగా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. అవార్డు అందుకుంటున్న సమయంలో తొలిసారిగా ఆయనతో పరిచయం జరిగిందని, ఆ తర్వాత ఎక్కడ కలిసినా తనను పెద్దన్న అని పిలిచేవారని రవిచంద్ర తెలిపారు. ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో అందేశ్రీ ని సన్మానించే అవకాశం లభించిందని అన్నారు. అలాగే గత నెల 19న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ కవితా సంపుటి ఆవిష్కరణ సభకు హాజరైన సందర్భంలో ఆయనతో కలిసి చాలాసేపు మాట్లాడటం జరిగిందన్నారు. అపుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నానని రవించంద్ర అన్నారు.




























